9, ఆగస్టు 2010, సోమవారం

చిరంజీవికి సాక్షి డైలీ కౌంటర్: సిఎం, మంత్రి కుట్ర కథ


హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై సాక్షి దినపత్రిక తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చిరంజీవిని సొంత ఊరిలో గెలవలేని నాయకుడిగా అభివర్ణించింది. చిరంజీవి ఆరోపణల వెనక ముఖ్యమంత్రి పాత్రతో పాటు ఓ మంత్రి కుట్ర ఉందని ఆరోపించింది. ఆ మంత్రి పేరు మాత్రం సాక్షి దినపత్రిక ఎక్కడా ప్రస్తావించలేదు. చిరంజీవి వ్యాఖ్యలను సమర్థించిన కాంగ్రెసు సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, కె. కేశవరావుల వెనక కూడా వారిద్దరే ఉన్నారని వ్యాఖ్యానించింది. చిరంజీవిని బలమైన నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం కూడా కాంగ్రెసు నాయకుల నుంచే జరుగుతోందని సాక్షి డైలీ వ్యాఖ్యానించింది.

కాంగ్రెసు పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని, ఇటువంటి స్థితిలో కాంగ్రెసుకు మద్దతిస్తానని చిరంజీవి పదే పదే అనడం వల్ల కాంగ్రెసు పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని సాక్షి వ్యాఖ్యానించింది. చిరంజీవి అంచెలంచెలుగా కాంగ్రెసుకు దగ్గర కావడం ఇటు చిరంజీవి, అటు కాంగ్రెసు బలహీనతను తెలియజేస్తోందని అభిప్రాయపడింది. కాంగ్రెసు పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించిన మహానేత వైయస్ కుమారుడిని టార్గెట్ చేసుకుని చిరంజీవి ఆరోపణలు చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఓ యువ శాసనసభ్యుడు అన్నట్లు చెప్పింది.

సాక్షి దినపత్రిక కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇచ్చిన తీరును కూడా తప్పు పట్టింది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మకు సోనియా ఆపాయింట్ మెంట్ కోరితే నెల రోజులు నిరీక్షించాల్సి వచ్చిందని, చిరంజీవి ఉన్న ఫలంగా సోనియా అపాయింట్ మెంటు దొరకడం వెనక కూడా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర ఉందని వ్యాఖ్యానించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి