14, ఆగస్టు 2010, శనివారం

'చిరు' వ్యాపారమే.. సేవకాదు: జీవిత-రాజశేఖర్


హైదరాబాద్, ఆగస్టు 14 : ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్‌లపై సినీ దంపతులు జీవిత-రాజశేఖర్‌లు మరోసారి దుమ్మెత్తిపోశారు. చిరంజీవి ట్రస్టు ఆధ్వర్యంలో చేస్తోంది ఫక్తు వ్యాపారమేనన్నారు. సేవ ముసుగులో అభిమానులు, ప్రజలు, ప్రభుత్వాలను ఏమారుస్తారంటూ ధ్వజమెత్తారు. శ్రీనగర్ కాలనీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వైద్యుడు హరికిషన్‌గౌడ్, స్వామి, రక్తదాత ప్రత్యూషలతో కలిసి జీవిత-రాజశేఖర్ విలేఖరులతో మాట్లాడారు.

సేవేది?
'ప్రధాన కూడలిలో ప్రభుత్వం నుంచి 4,500 చదరపు గజాల స్థలం 99 ఏళ్ళ లీజుకు పొందారు. దానికిగాను ఏడాదికి కేవలం రెండు వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నారు. అన్నిరకాల కిట్లతో పాటు ఏడాదికి రూ.13.5 లక్షల నగదు సర్కాను నుంచి తీసుకుంటున్నారు. మేము విమర్శలు ఆరంభించాకే 30 శాతం రక్తం పేదలకిస్తున్నారు. మిగతా 70 శాతం అమ్ముకుంటున్నారు.

ఒక్కో బ్యాగ్ స్క్రీనింగ్‌కి రూ.230కి మించి ఖర్చు కాదు. కానీ నిర్వహణా ఖర్చులంటూ ఒక్కో బ్యాగ్‌కూ రూ.800లు వసూలు చేస్తున్నారు. ఇది రక్తం అమ్మడం కాదా? ఇందులో సేవ ఏముంది. సేవ చేస్తున్నామని చెప్పుకునే అర్హత మీకెక్కడుంది' అని నిలదీశారు. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే దారినపోయేవారు కూడా బ్లడ్ బ్యాంక్ నడపగలరంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నారై, ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న సంస్థలో కేవలం చిరంజీవి కుటుంబ సభ్యులే ఉండడం, బ్లడ్ బ్యాంక్‌కు ఇన్‌చార్జిగా చిరంజీవి సోదరి మాధవి ఉండడాన్ని వారు ఆక్షేపించారు. రక్తం అమ్మిన డబ్బు ఏమి చేస్తున్నారని, పదేళ్ళయినా ఒక్క బ్రాంచీ కూడా తెరవకపోవడానికి కారణం ఏమిటని జీవిత-రాజశేఖర్ నిలదీశారు.

బ్లడ్‌బ్యాంక్‌లో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని, నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బాలానగర్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా దాఖలయిందని వారు చెప్పారు. బ్లడ్ బ్యాంక్‌కు వరుసగా ఐదేళ్ళగా వస్తున్న అవార్డులపై కూడా వారు సందేహం వ్యక్తం చేశారు. ఐఎస్ఓ ప్రమాణం లేని చిరు సంస్థ కంటే అపోలో, నిమ్స్ బ్లడ్ బ్యాంక్‌కు ఎంతో బాగున్నాయన్నారు. సేకరించిన కళ్ళలో ఎన్ని పేదలకు ఉచితంగా ఇచ్చారని నిలదీశారు. సేవ ముసుగులోనే చిరంజీవి పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు పొందుతున్నారని ఆ దంపతులు అభియోగం మోపారు.

నటులను నమ్మొద్దు
'ఎమ్జీఆర్, ఎన్టీఆర్‌ల మాదిరి సీఎం కావాలని చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. సినిమా వేరు.. నిజజీవితం వేరు. ఎవరూ ప్రజల గురించి ఆలోచించరు. మాలాంటి నటులను నమ్మొద్దు. మాకు కావాల్సింది అధికారం, డబ్బు' అని రాజశేఖర్ చెప్పారు. ఫ్యాన్స్‌ను కూడా చిరు మోసగిస్తున్నారని, ఓపెనింగ్స్ కోసం సినిమా టిక్కెట్ల ధర విపరీతంగా పెంచి అభిమానులను దోచుకుంటున్నారని విమర్శించారు.

సొంతగా పార్టీ పెట్టగానే టిక్కెట్లు అమ్ముకున్న చిరంజీవి, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారని ఆ దంపతులు నిలదీశారు. 'మీ పార్టీకి దమ్ములేదా? మీరు హీరో కాదా? దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి పదవి చేపట్టండి. అంతేకాని.. బురదజల్లిన కాంగ్రెస్‌లోకి రావడం ఏమిటి? మంత్రి పదవి ఎలా సంపాదించాలని నాటకాలు ఆడటం ఏమిటి?' అని జీవిత-రాజశేఖర్ ఎద్దేవా చేశారు.

కడప ఎంపీ జగన్ స్థానంలోకి రావాలని చిరు చూస్తున్నారని, దానిని సాగనివ్వబోమన్నారు. అనుభవంలేమి, అహం సమస్యలే జగన్‌కు ఉన్న అడ్డంకి అని, అధిష్ఠానం ఆయన్ను సరైన స్థానంలో నియమిస్తుందన్న ధీమా ఆ దంపతులు వ్యక్తం చేశారు. పత్రికలే జగన్ విషయాన్ని చిలువలు పలువలు చేస్తున్నాయని ఆక్షేపించారు.

ఏనుగులుండేది అడవుల్లోనే
మద్యపానం గురించి ఆవేదన వ్యక్తంచేస్తున్న చిరంజీవి ఆ అలవాటును మానుకున్నారా అని జీవిత-రాజశేఖర్ నిలదీశారు. తమని తాము ఏనుగులతో అరవింద్ పోల్చుకున్నారని, అవి అడివిలోనే ఉండాలంటూ వారు చురక అంటించారు. 'నాలుకలు కోస్తాం, గుడ్డలూడదీసి జీవితను తరిమేస్తాం, రాజశేఖర్ పెళ్ళాం మాట వినడం తప్పు అనుకున్న వారు మహిళలను ఎలా గౌరవిస్తారు' అని జీవిత నిలదీశారు. తనకు తెలుగు బాగా రాదు కనుకనే జీవిత వెంట వస్తున్నారని రాజశేఖర్ వివరణ ఇచ్చారు.

చిరు సినీ రంగం నుంచి వచ్చినవారు కాబట్టే తాము స్పందిస్తున్నామని, ఆయనకు వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడుతోంది తామేనని జీవిత-రాజశేఖర్ తెలియజేశారు. తమకు తెలిసిన విషయాలు ప్రజలకు చెప్పడంలో తప్పులేదన్నారు. మాట అనడం.. వెనక్కు తీసుకోవడం చిరుకి అలవాటంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యూష, గౌడ్, స్వామిలతో కూడా మాట్లాడించి, చిరు బ్లడ్‌బ్యాంక్‌పై మరిన్ని విమర్శలు కురిపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి