22, ఆగస్టు 2010, ఆదివారం

చిరంజీవిపై వాసిరెడ్డి పద్మ మెగా లేఖాస్త్రం



హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పై మరో మహిళా నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలపై ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఓ లేఖాస్త్రం సంధించారు. ఆమె ఈ నెల 6వ తేదీననే ఈ లేఖ సంధించినప్పటికీ విషయం శుక్రవారం బయటపడింది. అన్ని వివరాలను మీడియా సమావేసం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని వాసిరెడ్డి పద్మ అంటున్నారు. కొంత మంది నాయకులు తనను చిరంజీవికి దూరం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారికి పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అగ్రకులాలంటూ తమను పార్టీలో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. కొద్ది రోజులుగా తన పట్ల పార్టీలో వివక్ష చూపుతున్నారని ఆమె అన్నారు. చిరంజీవిపై, పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన శోభారాణిపై చర్య తీసుకోకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆక్షేపణ తెలిపారు. కింది వర్గానికి చెందడం వల్లనే తనను అణగదొక్కుతున్నారని శోభారాణి లేఖ రాసిన విషయం తెలిసిందే.

వాసిరెడ్డి పద్మ ఆరోపణలను ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు కొట్టిపారేస్తున్నారు. వాసిరెడ్డి పద్మ చేసినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాటిలో నిజం లేదని ఆయన అన్నారు. పద్మను దూరం పెట్టలేదని ఆయన చెప్పారు. పద్మ న్యూనతా భావానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారని ఆయన అన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి