12, ఆగస్టు 2010, గురువారం

ముఖ్యమంత్రి పీఠంపై చిరంజీవి మెగా ఆశలు


చిరంజీవి తెరపై మంచి నటుడే కానీ మహా నటుడు కాదు. కానీ ఆయన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మహా నటుడిగా మారారు. సోనియా గాంధీ అండదండలతో ఆయన క్రమంగా అన్ని జిల్లాల్లో తిరిగి పవర్ ఫుల్ డైలాగులతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా రంగంపై మమకారం పోకపోయినా సిఎం పీఠంపై ఆయనకు చాలా శాలు ఉన్నాయి.

కాంగ్రెస్ ‌లో నెలకొన్న అయోమయ పరిస్థితులను ఇప్పటినుంచే తనకు అనుకూలంగా మలచుకుంటే ఎప్పుడు నాయకత్వ మార్పిడి జరిగినా తనకు పనికివస్తుందని చిరంజీవి భావిస్తున్నారు. స్వయంగా సీఎం పదవి చేపట్టేంత బలం లేకపోయినా కాంగ్రెస్‌లో జగన్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా తనను తాను చూపించుకోవాలన్న తపనతోనే పనిచేస్తున్నట్లు ఆయన వ్యవహారశైలి స్పష్టం చేస్తోంది. తనకు కాంగ్రెస్‌-టీడీపీ రెండూ ప్రత్యర్థులేనని చిరంజీవి చెబుతున్నప్పటికీ.. ప్రత్యర్థి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలవగానే రెక్కలు కట్టుకుని ఢిల్లీకి వెళ్లడం, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం, రోశయ్య సర్కారు సంక్షోభంలో పడితే మద్దతునిస్తామని చెప్పడం, శాసనసభలో కాంగ్రెస్‌ సర్కారుకు దన్ను నిలవడం ఇవన్నీ ప్రత్యర్థి పార్టీకి చేయూతనివ్వడమే అవుతుంది. ఆ ప్రకారంగా చిరంజీవి చెప్పినట్లు కాంగ్రెస్‌ తనకు ప్రత్యర్థి కన్నా మిత్రుడేనని స్పష్టమవు తోంది.

జగన్‌ సొంతపార్టీ పెట్టుకుంటే కాంగ్రెస్ ‌లో జనాకర్షణ శక్తిగల నేత లేనందున, కాపు సామాజిక వర్గ బలం కూడా ఉన్న తన అవ సరం కాంగ్రెస్‌ కు బాగా ఉంటుందన్నది చిరం జీవి వ్యూహంలా కనిపిస్తోంది. అందుకే ఆయన ఇటీవలి కాలంలో జిల్లాల్లో పర్యటిస్తూ ‘జగన్‌ కే కాదు తనకూ జనాలు వస్తారని’ అధిష్ఠానానికి సంకేతాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి తగ్గట్టే కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కంట్లో నలుసులా ఉన్న జగన్‌పై ధ్వజమెత్తి, కాంగ్రెస్‌ నాయకత్వాన్ని మెప్పించేందుకు తాపత్రయపడుతున్నారు. కాంగ్రెస్‌లోని కాపు మిత్రులు కూడా తనను కాంగ్రెస్‌ లోకి తీసుకువచ్చేందుకు యధాశక్తిన కృషి చేస్తున్నందున..తన లక్ష్యం సులభంగా నెరవేరుతుందని చిరంజీవి భావిస్తున్నారు. పైకి కాంగ్రెస్‌ ను కూడా తాను వ్యతిరేకిస్తున్నానని చెబుతున్నా, చిరంజీవి పీఆర్పీ ఎప్పటికయినా కాంగ్రెస్‌లో విలీనం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఇప్పటికే బలపడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి