
హైదరాబాద్: పార్టీ పరిస్థితులను చక్కదిద్దకపోతే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిది మెగా తప్పు అవుతుదని మహిళా రాజ్యం అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన శోభారాణి అన్నారు. చిరంజీవిపై తనకు ఏ విధమైన వ్యతిరేకత లేదని ఆమె అన్నారు. చిరంజీవి చాలా మంచివారని, అతి మంచితనం కూడా ఒక్కోసారి నష్టం కలిగిస్తుందని ఆమె అన్నారు. ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి లైవ్ షోలో ఆమె మంగళవారం మాట్లాడారు. ఈ షోలో ఆమె కంట తడి పెట్టారు. పార్టీని నలుగురు నేతలు నాశనం చేస్తున్నారని, చిరంజీవి చుట్టూ చేరి పార్టీని కోలుకోకుండా చేస్తున్నారని ఆమె విమర్సించారు. ఆ నలుగురి పేర్లు వెల్లడించడానికి ఆమె నిరాకరించారు.
చిరంజీవి ఆశయాలు నచ్చి తాను పార్టీలో చేరానని, వెనకబడిన వర్గాలను చేరదీసి వారికి తగిన స్థానాలు కల్పిస్తారని ఆశించానని, అయితే పార్టీలో ఆ విధంగా జరగడం లేదని ఆమె అన్నారు. తాను పార్టీ కోసం ఎంతో చేశానని ఆమె చెప్పారు. రెడ్లపై తాను తిరగబడ్డానని ఆమె గుర్తు చేశారు. పార్టీలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని ఆమె అన్నారు. చిరంజీవి పేరును అప్రతిష్టపాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆమె అన్నారు. ఇప్పటికీ తాను రాజకీయంగా ప్రజారాజ్యం పార్టీతోనే ఉన్నానని ఆమె చెప్పారు. పార్టీ నుంచి గెంటేయడం సరి కాదని ఆమె అన్నారు. పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావుపై ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. తాను బహిరంగ లేఖ రాయడం తప్పు కాదని ఆమె అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి