9, ఆగస్టు 2010, సోమవారం

చిరంజీవి అభిమానుల రక్తం, కళ్లు అమ్ముకున్నారు: రాజశేఖర్



హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ మరోసారి విమర్శల జడివాన కురిపించారు. చిరంజీవి అభిమానుల రక్తం, కళ్లు అమ్ముకున్నారని వారు సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి లేదని వారన్నారు. కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహనరెడ్డిపై వ్యాఖ్యలు చేసే అర్హత చిరుకు లేదన్నారు. రాత్రి రాత్రికి డబ్బు సంపాదించుకోవడం చిరంజీవికి తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. సోనియా అపాయింట్ మెంటు కోసం చిరంజీవి నెలల తరబడి కాపు కాశారని వారన్నారు.

పార్టీ పెట్టి టిక్కెట్లు కూడా చిరంజీవి అమ్ముకున్నారని వారు ఆరోపించారు..సినీపరిశ్రమలోని ఏ నిర్మాతనూ సంపాదించుకోనీయకుండా చేశారన్నారు. సినీనటులపై ప్రజలకుండే ఆపేక్షను చిరంజీవి వాడుకున్నారని, అభిమానులను దోచుకున్నారంటూ వారిద్దరూ చిరంజీవిపై మండిపడ్డారు. పార్టీ పెట్టి, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుని దేశాన్ని దోచేయాలనే పథకంతో రాజకీయాల్లోకి వచ్చారని, అది సాగకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రిపదవి దక్కించుకోవాలనే యత్నం చేస్తున్నారనే అభియోగం మోపారు. జగన్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపి, ఆ స్థానాన్ని భర్తీచేయాలనేది చిరంజీవి వ్యూహమన్నారు. దానికి పార్టీలోని సీనియర్ నేతలు సహకరిస్తున్నారని వారు అభియోగం మోపారు.చిరంజీవితో ప్రకటన చేయించారంటున్న కోస్తాంధ్ర మంత్రిపై కూడా అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఎంతోమంది ఉద్యోగాలు వదిలేసి, ఆస్తులు అమ్ముకుని పీఆర్‌పీలో చేరారని, వారికి చిరంజీవి ఏమి న్యాయం చేశారని వారు ప్రశ్నించారు. అందువల్లే తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి ఒక్క అభ్యర్థీ లభించలేదని వారు ఎద్దేవా చేశారు. హీరో కాకపోయినా జగన్‌కు వస్తున్న జనం తనకు రాలేదన్న బాధ, ఈర్ష్య చిరంజీవికి ఉన్నాయన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి